‘Cultural Marxism'(కల్చరల్ మార్క్సిజం) – Book Launch Event in Bhagyanagar

హైదరాబాద్‌లో ఘనంగా కల్చరల్ మార్క్సిజం పుస్తకావిష్కరణ

​పుస్తకంలోని అంశాలను విపులంగా వివరించిన తెలుగు అనువాదకుడు వేదుల నరసింహం

“దీర్ఘకాలిక భావజాల పోరాటం ద్వారా సాంప్రదాయ సంస్థలను, కుటుంబ వ్యవస్థలను, సాంస్కృతిక విలువలను బలహీనపరచడమే కల్చరల్ మార్క్సిజం లక్ష్యం” అని సీనియర్ జర్నలిస్టు, తెలుగు అనువాదకుడు వేదుల నరసింహం పేర్కొన్నారు.

శనివారం (May 30) హైదరాబాద్‌లో జరిగిన “కల్చరల్ మార్క్సిజం: ది వార్ ఆన్ ఇంటెలెక్చువల్ డిస్క్రిషన్” తెలుగు అనువాదం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డా. నిరంజన్ బి. పూజార్ రచించిన ఈ పుస్తకాన్ని సంవిత్ ప్రకాశన్ ప్రచురించగా, సంతోష్‌నగర్‌లోని మారుతీనగర్ కమ్యూనిటీ హాల్‌లో మేధావులు, సామాజిక కార్యకర్తలు, పాఠకుల సమక్షంలో ఆవిష్కరించారు.

​ఈ సందర్భంగా మాట్లాడిన తెలుగు అనువాదకులు, సీనియర్ జర్నలిస్టు శ్రీ వేదుల నరసింహం, పుస్తకంలోని ప్రధాన అంశాలను విపులంగా వివరించారు. సమాజం, సంస్కృతి, విద్యా వ్యవస్థలు, సామాజిక సంస్థలపై కల్చరల్ మార్క్సిజం ప్రభావాన్ని ఈ పుస్తకం విశ్లేషిస్తుందని తెలిపారు. భారతీయ సమాజం ఎదుర్కొంటున్న సాంస్కృతిక సవాళ్లను ఈ గ్రంథం చర్చిస్తుందని పేర్కొన్నారు.

కల్చరల్ మార్క్సిస్టులు హిందూ కుటుంబ వ్యవస్థను, భారతీయ సంస్కృతిని బలహీనపరిచేందుకు ప్రయత్నించారని పుస్తక రచయిత విశ్లేషించినట్లు నరసింహం చెప్పారు. సమాజంలో విభేదాలు, వర్గ వైరాలు, జాతి ఆధారిత ఉద్రిక్తతలను సృష్టించడం ద్వారా అస్థిరతను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని పుస్తకంలో చర్చించారని తెలిపారు.

​సమాజంలో గందరగోళాన్ని సృష్టించడం, సంప్రదాయ ఆచార వ్యవహారాలను ప్రశ్నించడం, “క్యాన్సిల్ కల్చర్”ను ప్రోత్సహించడం, లైంగిక విద్య పేరుతో సాంప్రదాయ విలువలను సవాలు చేయడం వంటి అంశాలను రచయిత ప్రస్తావించారని తెలిపారు. దేశభక్తి భావనను బలహీనపరిచే ధోరణులు, జాతీయ గుర్తింపుపై దాడులు కూడా ఈ పుస్తకంలో చర్చించబడ్డాయని పేర్కొన్నారు.
​అక్రమ చొరబాటుదారులు, విదేశీయుల ప్రవేశాన్ని ప్రోత్సహించడం, సామాజిక అశాంతిని పెంచడం, మద్యం వినియోగాన్ని విస్తరించడం, ప్రజలను దేవాలయాలకు దూరం చేయడం వంటి పరిణామాల వల్ల సమాజం దెబ్బతింటుందని రచయిత అభిప్రాయపడినట్లు వివరించారు.

​న్యాయవ్యవస్థపై వ్యతిరేక భావజాలాన్ని పెంచడం, భారత్ వ్యతిరేక ఆలోచనలను వ్యాప్తి చేయడం, నైతిక విలువలు, మతబోధనలతో పాటు ముఖ్యంగా హిందూ ఆలయాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలను బలహీనపరిచే ప్రయత్నాలపై కూడా పుస్తకం దృష్టి సారించిందని తెలిపారు.

​కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం, సమాజంలో నైతిక విలువలను దెబ్బతీయడం, భద్రతా దళాలపై నిరంతర విమర్శల ద్వారా వారి మనోధైర్యాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను కూడా రచయిత విశ్లేషించారని నరసింహం పేర్కొన్నారు. అలాగే మీడియా పాత్రపై కూడా పుస్తకంలో చర్చించబడిందని, ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమంతో సహా కొన్ని వామపక్ష భావజాల ప్రభావిత మీడియా వేదికలు, చర్చా కార్యక్రమాలు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తున్నాయని రచయిత అభిప్రాయపడినట్లు వివరించారు.

​భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో దేశంలో రెండు ప్రధాన భావజాల ప్రవాహాలు ఉన్నాయని నరసింహం అన్నారు. ఒకటి కమ్యూనిజం కాగా, మరొకటి ఆర్‌ఎస్‌ఎస్ అని పేర్కొన్నారు. ఈ రెండు సంస్థలు 1925లో ప్రారంభమయ్యాయని, ఇప్పుడు శతాబ్ద కాలాన్ని పూర్తి చేసుకున్నాయని గుర్తు చేశారు.

​కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా చరిత్రను ప్రస్తావిస్తూ, స్వాతంత్ర్య పోరాటంలోని కొన్ని దశల్లో కమ్యూనిస్టులు బ్రిటిష్ పాలకులకు మద్దతు ఇచ్చారని, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను వ్యతిరేకించారని విమర్శించారు.

​కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మారుతీనగర్ కాలనీ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త శ్రీ కందుకూరి సుధాకర్ రెడ్డి.. పుస్తకాన్ని తెలుగు పాఠకులకు అందుబాటులోకి తీసుకురావడంలో జరిగిన కృషిని అభినందించారు. సమాజం, సంస్కృతి, భావజాలాలకు సంబంధించిన అంశాలపై మేధోపరమైన చర్చలు జరగడం అవసరమని అన్నారు.

​ఈ కార్యక్రమంలో సంవిత్ ప్రకాశన్ డైరెక్టర్ శైలజ గారు కూడా పాల్గొన్నారు.

శైలజ గారు పుస్తకంలోని ప్రధాన అంశాలపై మాట్లాడారు. సమాజానికి ఎదురవుతున్న భావజాలపరమైన సవాళ్లను ఈ పుస్తకం విశ్లేషిస్తుందని ఆమె తెలిపారు. ప్రగతిశీల ఆలోచనలు, అధ్యయనాలు, సామాజిక సంస్కరణల పేరుతో కొన్ని భావజాలాలు క్రమంగా సమాజంపై ప్రభావం చూపుతూ, సాంప్రదాయ విలువలు, కుటుంబ వ్యవస్థలు మరియు సాంస్కృతిక పునాదులను బలహీనపరిచే విధంగా పనిచేస్తున్నాయని పుస్తకం వివరిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఇటువంటి ధోరణులను గుర్తించి వాటిపై మేధోపరమైన చర్చ జరగాల్సిన అవసరాన్ని ఈ గ్రంథం ప్రస్తావిస్తోందని ఆమె వివరించారు.

ఈ సందర్భంగా ఆమె సంవిత్ ప్రకాశన్ కార్యకలాపాలను పరిచయం చేస్తూ, సంస్థ ద్వారా ఇప్పటివరకు దాదాపు 70 వరకు తెలుగు, ఆంగ్లం, తమిళం, కన్నడ తదితర భాషల్లో ప్రచురితమైన పుస్తకాల గురించి వివరించారు. చరిత్ర, సంస్కృతి, తత్వశాస్త్రం, జీవిత చరిత్రలు, సమకాలీన అంశాలకు సంబంధించిన పుస్తకాలను పాఠకులకు అందించేందుకు సంవిత్ ప్రకాశన్ కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యమైన గ్రంథాలను భారతీయ భాషల్లోకి అనువదించి విస్తృత పాఠక వర్గానికి చేరవేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో మేధావులు, సామాజిక కార్యకర్తలు, పాఠకులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొని పుస్తకంలో చర్చించిన అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *