భారతదేశాన్ని కబళించివేస్తున్న మతమార్పిడి మహమ్మారిని అడ్డుకోని పక్షంలో అది దేశ సంస్కృతీ సంప్రదాయాలకు పెను ప్రమాదంగా మారుతుందని వక్తలు పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తగా అవతరించి ఇల్లు వేదికగా ఇంటర్నెట్ ఆయుధంగా మతమార్పిడిపై పోరాటం చేయాలని కోరారు.
సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్(CSIS), లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ (LRPF) సంయుక్త సహకారంతో సంవిత్ ప్రకాశన్, చేతన స్రవంతి ఆధ్వర్యంలో సంవిత్ ప్రకాశన్ ప్రచురించిన ‘మతం పేరుతో అక్రమాలు – న్యాయపోరాటానికి మార్గాలు’, ‘గోవా ఇంక్విజిషన్’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో గురువారం సాయంత్రం (సెప్టెంబర్ 1న) భాగ్యనగరంలో జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం గారు, ప్రధాన వక్త రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, (RSS) ధర్మజాగరణ్ సమన్వయ్ అఖిల భారతీయ సహ సంయోజక్ శ్రీ ఎలె శ్యామ్ కుమార్ గారు, సంవిత్ ప్రకాశన్ డైరెక్టర్ శ్రీమతి నడింపల్లి పరిమళ గారు పుస్తకాలను ఆవిష్కరించారు.
అదే సమయంలో LRPF వెబ్‌సైట్‌ను శ్రీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం గారు ప్రారంభించారు. పుస్తక రచయితలు శ్రీ కూనపులి సహదేవ్ గారు, శ్రీ అయ్యల సోమయాజుల సంతోష్ గారిని వేదికపైన ఉన్న అతిథులు సత్కరించారు.
ప్రధాన వక్త ఎలె శ్యామ్ కుమార్ గారు మాట్లాడుతూ మతమార్పిడిని సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యగా తెలిపారు. ఒక పెన్ను, పేపరుతో మతమార్పిడి, చర్చిల నిర్మాణానికి అడ్డుకట్ట వేయడంతో పాటుగా క్రైస్తవుల సంఖ్యను తగ్గించవచ్చునని వారు తెలిపారు. ఇందుకు గ్రామసభలను వేదికగా చేసుకోవాలని చెప్పారు. ఈ విషయంలో ఇంటర్నెట్ ద్వారా ఇంట్లో నుంచే ఫిర్యాదు చేయవచ్చునని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కార్యకర్తగా అవతరించాలని శ్యామ్ కుమార్ గారు అన్నారు. బైబిల్ చదవకుండానే కోట్లాది మంది ప్రజలు నిర్బంధంగా క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నారని తెలిపారు. ఆంధప్రదేశ్‌లో పర్యటించిన సందర్భంగా 8,000 జనాభా ఉన్న గ్రామంలో 130 చర్చిలు ఉన్నాయని వారు చెప్పారు. కడకు క్రైస్తవులు లేని గ్రామాల్లో సైతం చర్చీలు వెలుస్తున్నాయని తెలిపారు.
1999లో భారత్ పర్యటన సందర్భంగా కొత్త సహ్రసాబ్దిలో యావత్ భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చడం తమ లక్ష్యమని వాటికన్ సిటీ పోప్ ప్రకటించారని, ఆ దిశగా జోషువా ప్రాజెక్టు దేశంలో పనిచేస్తున్నదని శ్రీ శ్యామ్ కుమార్ గారు తెలిపారు. పోప్ ప్రకటనను సాకారం చేయటం కోసం భారత్ అంతటా 48 లక్షల మంది కార్యకర్తలు, 2,000 మిషనరీలు పనిచేస్తున్నాయని వారు తెలిపారు. భారతీయులు ఆరంభంలోనే జాగృతం కావడం ద్వారా దక్షిణ భారతదేశంలో క్రైస్తవ మతవ్యాప్తిని అడ్డుకోవాలని అన్నారు. సమష్టిగా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ముంచుకొస్తున్న విపత్తును ఎదుర్కోవాలని వారు చెప్పారు.
ముఖ్య అతిథి శ్రీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా లౌకికవాదాన్ని ఒక మానసిక వ్యాధిగా చేసుకోవడం ద్వారా మన పిల్లలు తమదైన సంస్కృతీ సంప్రదాయాల వారసత్వ సంపదకు దూరమైపోయారని అన్నారు. దేశానికి స్వరాజ్యం సిద్ధించిన తర్వాత లౌకికవాదాన్ని ప్రతిఘటించడానికి భారతీయులకు 60 సంవత్సరాల కాలం పట్టిందని వారు చెప్పారు. ఇండోనేషియాలో 25వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీ కృష్ణ భగవాన్ విగ్రహాన్ని నెలకొల్పారని తెలిపారు. అదే విధంగా విశిష్టమైన భారతీయ ఆధ్యాత్మికతకు సంకేతం అన్నట్టుగా కొత్త పార్లమెంట్ భవన సముదాయంలో గీతాకారుని విగ్రహాన్ని కేంద్ర ప్రభుత్వం నెలకొల్పాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు శ్రీ ఎల్.వి.సుబ్రహ్మణ్యంగారు అన్నారు. భారతీయ సమాజాన్ని పట్టిపీడిస్తున్న మతమార్పిడి మహమ్మారిని న్యాయబద్ధంగా, ఆధ్యాత్మికపరంగా, నైతికతతో ఎదుర్కోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
RSS క్షేత్ర ప్రచార ప్రముఖ్ శ్రీ నడింపల్లి ఆయుష్ గారు మాట్లాడుతూ జాతీయ భావాలు కలిగి లేదా సరైన దృష్టికోణంతో చరిత్రను సమర్పించడం అత్యంత అవసరమని అన్నారు. ఆ దృష్ట్యా సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్(CSIS) అనే సంస్థ ఏర్పడిందని తెలిపారు. రీసెర్చ్ స్కాలర్ల నియామకం, పార్సీ, అరబిక్ భాషా నిపుణుల సహకారం, ఉర్దూ భాషా నిపుణుల నియామకం ద్వారా CSIS కార్యాచరణకు పటిష్టమైన ప్రయత్నం చేస్తున్నట్టు ఆయుష్ గారు చెప్పారు. న్యాయపోరాటం చేయడంలో సామాన్య ప్రజలకు సాధికారిత కల్పించే దిశగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ (LRPF) పని చేస్తున్నదని వారు తెలిపారు. ఆ క్రమంలో గడచిన అనేక సంవత్సరాలుగా చాలా గ్రామాల్లో ప్రజలు న్యాయాన్ని పొందడంలో LRPF కార్యకర్తలు విజయం సాధించారని ఆయుష్ గారు తెలిపారు. మరిన్ని వివరాలతో CSIS, LRPF ల గురించి సభికులకు వారు పరిచయం చేశారు.