ఘనంగా జరిగిన శివభారతం పుస్తకావిష్కరణ సభ

ఛత్రపతి శివాజీ గురించి అనేకమంది అనేక పుస్తకాలు ఉన్నాయి. విదేశాస్తులు కూడా అనేక విషయాలు వ్రాసారు. కానీ అవన్నీ ఆయన జీవితాన్ని గురించి వివరాలు ఇస్తే శివభారతం మాత్రం శివాజీ జీవితపు స్ఫూర్తిని, ప్రేరణను మన అనుభూతికి తెస్తుంది. అది ఈ కావ్యపు ప్రత్యేకత’ అని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ కార్యకారిణి సదశ్యులు శ్రీ రామ్ మాధవ్ అన్నారు. లోక కళ్యానాన్ని సాధించడం కార్యపు లక్ష్యమని దానిని శివభారతం కార్యం పూర్తిగా నెరవేర్చిందని అభిప్రాయపడ్డారు.

భాగ్యనగర్ కూకట్ పల్లి లోని పి ఏం ఆర్ పాఠశాల ఆడిటోరియమ్ లో శనివారం నాడు జరిగిన `శివభారతం’ కావ్య పునర్ముద్రణ ప్రతిని ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్య వక్తగా మాట్లాడారు.

శివభారతం రచయిత గడియారం వెంకటశేష శాస్త్రి గారు కూడా తమ గ్రంధ ప్రచురణకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అయిన సమాజ శ్రేయస్సు కోసం వాటిని లెక్కచేయకుండా ముందుకు వెళ్లరని రామ్ మాధవ్ గుర్తుచేశారు. తరతరాలను ప్రభావితం చేసే శక్తి సాహిత్యానికి ఉంటుందని, శ్రీశ్రీ సాహిత్యం కూడా అనేకమందిని కదిలించిందని, కానీ అది సామాజిక ప్రయోజనాన్ని, యువతరానికి మార్గనిర్దేశనాన్ని చేయలేకపోయింది. అయితే శివభారతం ఆ పని చక్కగా నెరవేర్చింది. ఈ కావ్యంలో అన్నీ పద్యలే. వాటిని ఇప్పుడు చదివి అర్ధం చేసుకోవడం కష్టం. ఇలాంటి స్థితి రావడానికి మనం మాతృభాషను నిర్లక్ష్యం చేయడమేనని రామ్ మాధవ్ విచారం వ్యక్తం చేశారు. శివభారతం కావ్యంలో రచయిత గడియారం వారు దేశ ప్రజానీకం ఎల్లప్పుడు గుర్తుపెట్టుకుని, అనుసరించవలసిన విలువలను మనకు చెప్పారని ఆయన అన్నారు. మహిళల పట్ల పూజ్యభావన కలిగి ఉండడమే భారతీయత. ఆ పూజ్యభావన ఉంటే నేడు చూస్తున్న అత్యాచారాలు, ఘోరాలకు తావు ఉండదని, అదే విషయాన్ని శివాజీ జీవితం మనకు చెపుతుందని రామ్ మాధవ్ అన్నారు. యువతలో సంస్కారాలను నింపే ఇల్లు, గుడి, సమాజం నేడు ఆ పని చేయలేకపోతున్నందువల్లనే సర్వత్ర గొడవలు, అవినీతి వంటివి కనిపిస్తున్నాయన్నారు. సైన్యంలో చేరాలనుకునేవారు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఇది సంస్కార లోపమేనని ఆయన అన్నారు. సాధారణ గిరిజనులలో సంస్కారాలు, దేశభక్తి నింపిన శివాజీ వారి ద్వారా హిందూ సామ్రాజ్య స్థాపన చేయగలిగారని, ఇదే విషయాన్ని శివభారతం మనకు చెపుతుందని ఆయన అన్నారు. ఇటీవంటి గ్రంథాన్ని పునర్ ముద్రించి ప్రజల మధ్యకు మరోసారి తెచ్చిన సంవిత్ ప్రకాశన్, గ్లోబల్ ఇల్యూమైన్ సంస్థలు ప్రశంసాపాత్రమైనవని ఆయన అభినందించారు.

అంతకు ముందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్.వి . సుబ్రమణ్యం మాట్లాడుతూ స్వాతంత్ర్యం ఏమిటి? ఎందుకు? అనే విషయాల్లో స్పష్టత, ఏకాభిప్రాయం లోపించడం వల్లనే గత 70 ఏళ్లుగా మన దేశం ఒక అడుగు ముందుకు వెళితే నాలుగు అడుగులు వెనుకకు వేస్తున్నదని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే సరైన దిశలో కదలి ఉంటే నేడు అనుభవిస్తున్న నష్టాన్ని నివారించగలిగే వారమని ఆయన అభిప్రాయపడ్డారు. శివాజీ మహరాజ్ అనుసరించిన విదేశాంగ, వ్యవసాయ, ఆర్ధిక విధానాలు నేటికీ ఉపయోగకరమని అన్నారు. శివభారతం వంటి కావ్యాలను విద్యాలయాల్లో విద్యార్థులకు చెపితే ఎంతో ఉపయోగమని అన్నారు.

కార్యక్రమంలో మరొక ముఖ్య అతిధిగా పాల్గొన్న శ్రీశైలం శివాజీ స్ఫూర్తి కేంద్ర కార్యదర్శి శ్రీ రఘురామయ్య గారు స్ఫూర్తికేంద్ర నిర్మాణాన్ని వివరించారు. అందరూ స్ఫూర్తి కేంద్రాన్ని తప్పక సందర్శించి ప్రేరణ పొందాలని ఆహ్వానించారు.

వందేమాతర గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమయింది. తరువాత గ్లోబల్ ఇల్యూమైన్ సంస్థాపక సభ్యులు శ్రీ సంతోష్ శివభారత పునర్ ముద్రణ గురించి వివరించారు. గడియారం వెంకటశేష శాస్త్రి గారి జీవిత విశేషాలను వారి మనవడు శ్రీ వెంకటశేషశర్మ సభికులకు వివరించారు. డా. కె.కె.వి. శర్మ గారు శివభారతం పుస్తక పరిచయం చేశారు.  తరువాత శివభారతం ప్రతిని డిజిటల్ రూపంలోకి తేవడానికి విశేష కృషి చేసిన శ్రీమతి నడింపల్లి సరోజినీ రావు గారిని సత్కరించారు.  దాంతో పాటు ప్రచురణకు సహకరించిన శ్రీ నాగేశ్వర్ గారిని సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కూకట్ పల్లి జిల్లా సంఘచాలక్ శ్రీ సుభాష్ చంద్ర బోస్, గ్లోబల్ ఇల్యూమైన్ సభ్యులు శ్రీ విజయసారధి గార్లు కూడా వేదికను అలంకరించినవారిలో ఉన్నారు. చిన్నారులు ఆలపించిన శివభారతం కావ్యంలోని పద్యాలు సభికులందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *