Description
స్వర్ణ భారతి (భారతీయ ఆర్ధిక చరిత్ర)
భారతీయ జీవిత లక్ష్యాలను పురుషార్ధాలు అంటారు. ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు నాలుగు పురుషార్ధాలు. వీటిలో అర్ధం అంటే జీవిత లక్ష్యాలను సాధించుకునేందుకు లేక సంపాదించడానికి కావలసిన భౌతిక, మానసిక సాధనా సంపత్తి. అందులో ధనం లేక సంపద ఒక భాగం. సంపదకు సంబంధించిన ఆధునిక శాస్త్రం ఆర్ధిక శాస్త్రం. భారతీయులు నిర్మించిన ఆర్ధిక శాస్త్రానికి, ప్రాశ్చాత్యుల శాస్త్రానికి మూల సూత్రాలలో, సిద్ధాంతంలో, ప్రయోగంలో చాలా తేడా ఉంది. ప్రస్తుతం మన విద్యావిధానంలో ప్రాశ్చాత్య తరహా అర్దికశాస్త్రాన్ని నేర్పుతున్నారు. మన ఆర్ధిక వ్యవస్థను కూడా ప్రాశ్చాత్య ఆర్ధిక సూత్రాల మీదే నడిపే ప్రయత్నం సాగుతోంది. దాని ఫలితాలు మనకు తెలిసినవే.
నేడు మన సమాజాన్ని, సంస్కృతిని, మతాన్ని ఒక రీతిలో చూసి, బేరీజు వేసి అర్ధం చేసుకొంటున్నాము. అదే పద్ధతిలో మన ఆర్ధిక చరిత్రకు సంబంధించిన అనేక ఆధారాలను లెక్కలోకి తీసుకోవడం లేదు. అందువల్ల మన ఆర్ధిక చరిత్ర పట్ల మనకు సరైన అవగాహన లేకుండా పోయింది. ఇప్పటివరకు మన పాఠ్యప్రణాళికలోను, ప్రజా మాధ్యమాల్లోనూ, విస్మరించిన ఆర్ధిక చరిత్ర ఆధారాలను లెక్కలోకి తీసుకొని ఆర్ధిక చరిత్రను రచించినట్లయితే ఇప్పుడు మనకున్న అనేక అపోహలు తొలగిపోతాయి. ఈ పుస్తకం ఆ దిశలో ఒక చిన్న అడుగు. దీన్ని చదవడంవల్ల ప్రస్తుతం పరస్పర అపోహలవల్ల దూరమైన వివిధ కులాలు, వర్గాల మధ్య అవగాహన, సామరస్యం పెరుగుతుంది. దానివల్ల సమైక్యత, సహకారం మెరుగుపడతాయి. సమైక్యత పెరిగితే సామర్ధ్యం, ఉత్పాదకత పెరుగుతాయి. ఆ విధంగా నిజమైన దేశాభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు జరిగిందని, జరుగుతోందని చెపుతోన్న అభివృద్ధి ప్రజల ఐక్యతతో, సహకారంతో కాకుండా వాళ్ళకు అసత్యాలు, అర్ధసత్యాలు చెప్పి జోకొట్టి, మభ్యపెట్టి సాధించినదే. ఇది ఎంతో కాలం నిలవదు. నిలిచినా ప్రజలకు సమానంగా అందధు.
మన ప్రజలకు సంప్రదాయ వ్యవస్థలో అలవడిన నిపుణతల ఫలితమే నేటి అభివృద్ధి. కాని మన పాలకుల ప్రాశ్చాత్య దృక్పధం, విదేశీ ఆర్ధిక నమూనా మరియు తప్పుడు ప్రాధామ్యాల వలన అభివృద్ధి ఫలాలు చేరవలసిన వాళ్ళకు చేరడంలేదు. విదేశీ శక్తుల ప్రాబల్యం దీనికి కారణం. అలాంటి విదేశీ శక్తుల పలుకుబడి ప్రాబల్యం దీనికి కారణం. అలాంటి విదేశీ శక్తులు శతాబ్దాల పాటు మన దేశంలో సాగించిన విధ్వంసకాండను ఈ పుస్తకం ఆధారాలతో సహా మీ ముందు ఉంచుతుంది. ఆ విధ్వంసకాండ వల్ల మన సమాజం మొత్తం విపరీతంగా నష్టపోయింది. వివిధ కులాలు అనేక రీతుల్లో, వివిధ స్థాయిల్లో నష్టపోయాయి. కోట్ల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా, సంపన్నులు మధ్యతరగతివారిగా మారారు, మధ్యతరగతివాళ్ళు పేదలయ్యారు. పేదలు బిచ్చగాళ్ళయ్యారు. అనేక కులాలవాళ్ళు అడవుల్లోకి పారిపోయి ఆటవికులయ్యారు. ఈ పుస్తకం చివరి అధ్యాయంలో కొన్ని వివరాలున్నాయి. అవి జరిగిన దానితో పోలిస్తే చాల కొద్ది మాత్రమే. కానీ విదేశీ భావజాలం జీర్ణించుకున్న మన చరిత్రకారులు, అదే భావజాలం కలిగిన పాలక వర్గాల సహాయంతో బోధిస్తున్న చరిత్ర పాఠాల్లో మన సమాజంలో పతనమైన కులాల కష్టనష్టాలకు ఇతర కులాల వాళ్ళు కారకులని ప్రచారం చేస్తున్నారు. అందువల్ల మన సమాజంలో వివిధ కుల వర్గాల మధ్య అపోహలు పెరిగాయి. కానీ నిజాలు వేరుగా వున్నాయి. పైన చెప్పినట్లు ప్రజల మధ్య అవగాహనతో కూడిన స్నేహ సహకరాలున్నప్పుడే నిజమైన, దీర్ఘకాలిక, సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది. అటువంటి అవగాహన కలిగించడంలో ఈ పుస్తకం సహాయపడుతుంది. మన భవిష్యత్తు నిర్మించుకునేందుకు అలాంటి అవగాహన అవసరం. అది భావితరాలపట్ల మనకున్న బాధ్యత.
ఈ పుస్తకంలో వెల్లడించిన కొన్ని చారిత్రక సత్యాలు ప్రజానీకానికి పరిచయమైనవి కాకపోవడంవల్ల, మొదట్లో కొంత అలజడి కలగవచ్చును. కొన్ని విదేశీ మతాలను, సంస్కృతులను అనుసరించేవారికి కష్టం కలగవచ్చును. కానీ మన దేశ చరిత్రలో, వర్తమాన వ్యవహారాల్లో ఆ శక్తులు నిర్వహించిన, నిర్వహిస్తున్న పాత్రను నిస్పాక్షికంగా, ఆధారాలతో సహా బయటపెట్టడం ఒక చారిత్రక అవసరం. ఎవరినీ అకారణంగా ద్వేషించడం మన ఉద్దేశం కాదు. అలాగని మనం ఎవరి చేతిలో నష్టపోయమో వారి చేతలను బయటపెట్టక తప్పదు కదా. అలా బయటపెట్టకపోవడంవల్లె ఈనాడు మనలో మనం కొట్టుకుంటున్నాం. యదార్ధాలను పరిగణలోకి తీసుకుని మన ఆర్ధిక చరిత్రను చదివినట్లైతే నిజం తెలుస్తుంది. నిజమొక్కటే మన భవిష్యత్తుకే, అభివృద్ధికే పునాది కాగలదు. ఎవరికో మనసు నొచ్చుతుందని, లేదా ఎవరి దౌర్జన్యా ధోరణికో భయపడి, ఆ భయానికి సామరస్యం అనే ముసుగు వేసి చరిత్ర సత్యాలను దాచిపెట్టడంవల్ల మనకు మనమే అపకారం చేసుకున్నవాళ్ళం అవుతున్నాం. అది తగదు. నిజాన్ని నిజంగా స్వీకరిద్దాం.
సత్యమేవ జయతే నానృతం
- ISBN : 978-81-965393-6-8 ; 250 pages ; Samvit Prakashan ; Language : Telugu ; Paperback
Reviews
There are no reviews yet.