
నమస్తే.
పుస్తక సమీక్ష: మిషనరీ మాయాజాలం – పాశ్చాత్య పంజరంలో తాంత్రిక భారతం.
రచన: శ్రీ మైలవరపు సుధామోహన్.
సంవిత్ ప్రకాశన్ వారి ప్రచురణ. 232 పేజీల పుస్తకం, 250 రూపాయలు మాత్రమే.
శ్రీ సుధామోహన్ ఏవియేషన్ రంగంలో Maintenance Engineer. కెనడాలో ఉద్యోగి అయినా హృదయమంతా భారత్ పైనే, హిందూ సమాజం పైనే. వీరు మంచి విశ్లేషకులు, అనువాదకులు, పరిశోధకులు.వీరు లోగడ రచించిన పుస్తకాల్లో మన దేశం ఎదుర్కొంటున్న అనేక సామాజిక సమస్యలను చాలా లోతుగా చర్చించారు. కుహనా మేధో నియంతలు, శివస్య కులం దీనికి ఉదాహరణలు. ప్రస్తుత గ్రంథం మిషనరీ మాయాజాలం నాలుగు అధ్యాయాలు, దాదాపు 60 కి పైగా వ్యాసాల సమాహారం.
16వ శతాబ్దంలో మొదలైన క్రైస్తవ ప్రచారం ఎలా భారతీయతను దెబ్బతీసింది, విభజించి పాలించే దుర్నీతి ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వానికి మిషనరీలు ఏ విధంగా అండదండలు అందించి సమాజంలో అనేక మందిని క్రైస్తవ అనుకూలంగా, బ్రిటిష్ పాలనకు సుముఖంగా ఉండేలా మార్చారు, దానికై వారు ఉపయోగించిన వ్యూహాలను రచయిత ఈ పుస్తకంలో చాలా విపులంగా పేర్కొన్నారు. ప్రజల మనసులో విషబీజాలు నాటి ఇతర దేశాల్లో అనేక సంస్కృతులను మట్టుపెట్టిన ఫార్ములానే భారత్‌లోనూ అమలుపరుస్తున్న విధి విధానాలను వర్ణించారు రచయిత.
మిషనరీల మాయాజాలాల్ని రుజువులు, సాక్ష్యాలతో పాఠకుల ముందు పెట్టారు. భారతీయ సమాజంపై చీలికలు తెచ్చేలా వర్ణాశ్రమ ధర్మాలపై దుష్ప్రచారాన్ని చేసిన వివరాలను శ్రీ సుధామోహన్ అనేక గ్రంథాల ఆధారంగా విశ్లేషించారు. బ్రాహ్మణులపై మిషనరీల అక్కసుతో చేసిన దుష్ప్రచారానికి బ్రిటిష్ పాలకులు ఏ విధంగా సహాయపడ్డారో చెబుతూ, పాలకులు మిషనరీలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు అన్నారు.
ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన స్వార్థ కారణాలను, దానికి Bishop Caldwell పాత్ర, వివిధ సంప్రదాయాలు చీల్చే కుట్రలను రచయిత అనేక అధ్యాయాల్లో, వివిధ వ్యాసాల్లో ఎన్నో ఉదాహరణలతో అందించారు. ఆర్య ద్రవిడ పదాల సృష్టి, పాశ్చాత్య భాషాశాస్త్రాలకు దీనితో link, సంస్కృత తమిళ భాషల విభజన ఏ విధంగా అసత్యమో తెలిపే అనేకానేక ఆదారాలను వెలికితీసి అందించిన ఈ పుస్తకం భారతీయులను మేల్కొల్పే బృహత్ ప్రయత్నం.
భారతీయ మతమైన హిందూ మతానికి Paganism, heathenism అని పిలుస్తూ వారి కట్టుబొట్టులను విమర్శిస్తూ మతం మారని వారిని చిత్రహింసలకు ఎలా గురిచేశారో, ఆ రక్తసిక్త చరిత్ర ఏంటో 1560-1812 మధ్య ఎలా జరిగిందో గోవాలో బుడత కీచులు పోర్చుగీసు వారి దురాగతాలు ఎలాంటివో ఉదాహరిస్తూ రచయిత హృదయం ద్రవించేలా వర్ణించారు. హిందువులను నయానా భయానా క్రైస్తవంలోకి మార్చి యూరప్ పాలకులకు విధేయులుగా చేయాలని, భారతదేశాన్ని క్రైస్తవ సామంత రాజ్యంగా మార్చడానికి చేయని ప్రయత్నాలు లేవంటూ సాక్ష్యంగా 1597 నుంచి 1683 కాలఖండంలో జరిగిన ఎన్నో ఉదంతాలను వీరు వెలికితీసి అందించారు. ఎందరో చారిత్రక పరిశోధకులు రాసిన తెలుగు, ఇంగ్లీష్ గ్రంథాలను ఆధారంగా చేసుకుని ఈ సత్యాలను ఉటంకించారు రచయిత శ్రీ సుధామోహన్.
17వ శతాబ్దంలోనే దక్షిణాదిలో క్రైస్తవ మత ప్రచారం ఊపందుకోవడం, 1711-1713 మధ్య అచ్చుయంత్రాన్ని ప్రవేశపెట్టడం, వాటి ద్వారా బైబిలు, ఇతర మత ప్రచార పుస్తకాల ముద్రణ సమాచారాన్ని రచయిత పేర్కొన్నారు ఈ పుస్తకంలో. హిందూ గుళ్లపై ఆంక్షలు, ఆదాయం దుర్వినియోగం అప్పుడే మొగ్గ తొడిగిందని అర్థమవుతుంది మనకి.
తెలుగు చరిత్రకారులైన బి.ఎస్.ఎల్. హనుమంతరావు గారు, శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు, ఆచార్య పాలడుగు శేషాచల వర్మ రాసిన పుస్తకాల ఆధారంగా ఆంధ్రాలో మతమార్పిడి పర్వాన్ని వివరించారు. మెకాలేకు ఉన్న సంస్కృత భాషా ద్వేషాన్ని అతడు తండ్రికి రాసిన ప్రసిద్ధ ఉత్తరాన్ని ఉటంకించారు శ్రీ సుధామోహన్.
ధర్మపాల్ స్ఫూర్తితో శ్రీ ఖండవల్లి సత్యదేవ ప్రసాద్ గారి కలం అందించిన చదువుల చెట్టులోని అనేక అంశాలను అనేక చోట్ల రచయిత ఉదహరించారు. భారతీయ శాస్త్రాల ప్రకారము విద్య ముక్తికి, మోక్షానికి, జ్ఞానానికి ఉపయోగిస్తుండగా, క్రైస్తవులు, సామ్రాజ్యవాదుల అభిప్రాయంలో విద్య తమకు అనుకూలమైన వారిని నిర్మించుకోవడమే అని అనేక మార్లు రచయిత పేర్కొన్నారు. భాషాశాస్త్రం అంటూ సృష్టించిన అయోమయ సిద్ధాంతం దానివల్ల బయలుదేరిన అనర్థాలను రచయిత దాదాపు 50 పేజీల్లో విశదీకరించారు.
దక్షిణాది భాషలు సంస్కృత జన్యాలు కావనె అసత్య సిద్ధాంతం, భాషాశాస్త్రంలో హిందువులను విభజించిన వైనం, దానికి వత్తాసు పలికిన Brian Houghton Hodgson, Bishop Caldwell, John Stevenson ల మోసపు రాతలను పేర్కొన్నారు. ద్రావిడ భాష అంటే ఏమిటో సంస్కృతం కన్నా ముందే ఉన్నదని, అనగా ద్రావిడులు హిందువులు కారనే వాదనను మొదలుపెట్టిన ఘనులే నేటి దుష్పరిణామాలకు పునాది రాళ్లు. దాని ఫలితంగా బ్రాహ్మణులు ఆర్యులని, ఇతరులు ద్రావిడులనే ప్రచారం ఊపందుకుంది. ఈ లోపభూయిష్ట వలస సిద్ధాంతాన్ని రచయిత తూర్పారబట్టారు.
ఆర్యుల దండయాత్ర సిద్ధాంతానికున్న డొల్లతనాన్ని జన్యుపరంగా, ఇతర పరిశోధనల ఆధారంగా వెలికితీశారు. ఈ సిద్ధాంతాన్ని డాక్టర్ అంబేద్కర్ గారు ఖండించిన వైనాన్ని ఓ అధ్యాయంలో పేర్కొన్నారు. ఈ సిద్ధాంతానికి ప్రధాన కారణం తెల్లజాతి వారు విదేశీయులని చెప్పడానికి వీలులేకుండా ఆర్యుల పూర్వీకులైన తెల్లవాళ్లు భారతదేశాన్ని ఏలడం సమంజసం అనే ప్రచారం కోసమే అంటూ 1866 ఏప్రిల్ 10న లండన్‌లో జరిగిన Royal Asiatic Society రహస్య సమావేశంలో ఈ తప్పుడు చరిత్రను చాలా కుతంత్రంతో వండి వడ్డించారు అంటారు రచయిత. Stephen Knapp, భూదేవ్ శర్మ, సబరన్ ఘోష్ ల రాతలను దీన్ని సమర్థిస్తూ ఉదాహరించారు శ్రీ సుధామోహన్.
1939 నుంచి ఈ.వీ. రామస్వామి పోషించిన పాత్ర బ్రిటిష్ ప్రయోజనానికి ఎలా సహాయపడిందో ఓ బృహత్ వ్యాసంలో ఎన్నో తెలియని చరిత్ర మర్చిపోయిన వాస్తవాలను ఉదహరించారు. పాకిస్తాన్ తీర్మానం లాగానే ద్రవిడనాడు విడిగా ఓ దేశంగా ప్రకటించాలని కోరిన రామస్వామి కుతంత్రాన్ని, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని అతగాడి రక్తదాహాన్ని నెహ్రూ సైతం వ్యతిరేకించడాన్ని ఈ అధ్యాయంలో ఉదాహరించారు. Justice Party తమ బ్రాహ్మణ వ్యతిరేకతకి పరాకాష్టగా స్వాతంత్రం వద్దు బ్రిటిష్ పాలనే ముద్దు అనడాన్ని రచయిత ఉదాహరించారు. 15 సంవత్సరాల Justice Party పాలన జాతికి ఎంతో Injustice జరిగిందని సోదాహరణంగా శ్రీ సుధామోహన్ పేర్కొన్నారు.
ముగింపుకు ముందు కమ్యూనిజం బ్రిటిష్ వారి సృష్టి అంటూ ఎన్నో కొత్త విషయాలను తెలియజేశారు. కార్ల్ మార్క్స్ పుట్టకముందే కమ్యూనిజం పారిస్ వీధుల్లో పుట్టిందని, Communist Manifesto కి 50 సంవత్సరాల ముందే ఇంచుమించు అవే ఆశయాలను ఫ్రెంచ్ Radicals పేర్కొన్నారని రచయిత ఈ అధ్యాయంలో ఉదాహరిస్తూ బాబూఫ్ (Babeuf) ఇందుకు ఆద్యుడని, మార్క్స్‌కి ఇతనికి ఉన్న పోలికల్ని రచయిత పేర్కొన్నారు. బ్రిటిష్ వారి ద్వారా మొదలైన కమ్యూనిజం బోల్విక్ ఉద్యమ కాలంలో ముస్లింల మద్దతుతో కమ్యూనిజం భారతలోకి ప్రవేశించింది. పాశ్చాత్యుల చేతుల్లో ఇస్లామిక్ మత ఛాందసుల చేతుల్లో ఆయుధంగా మారింది అంటారు రచయిత.
చివరగా అనుబంధంగా శ్రీ వేదవ్యాస, శ్రీ కోట వెంకటాచలం గారు, చివుకుల అప్పయ్య శాస్త్రి గారు, చివుకుల నారాయణ గార్లు వివిధ సందర్భాల్లో అందించిన వ్యాసాలను జతచేశారు. ఈ విధంగా 1856 లో Caldwell నాటిన విషబీజం ద్రవిడ సిద్ధాంతం అనే ప్రమాదకరమైన విషవృక్షంగా పెరుగుతోంది. రాజకీయంగా విష ఫలాలను అందిస్తోంది. దేశ ఐక్యతకు ప్రగతికి సంభవించున్న ప్రమాదాలను గుర్తెరిగి వ్యవహరించాల్సిందిగా పాలకులను, పాఠకులను ప్రబోధిస్తారు ప్రవాస భారతీయులైన శ్రీ సుధామోహన్. మేధో స్వాతంత్రం, ఆధ్యాత్మిక స్వాతంత్ర పునాదులు మన సనాతన ధర్మానికి నిజమైన సుధా బిందువులు.
ఎంతో పరిశోధన ఫలితంగా అందించిన ఈ మిషనరీ మాయాజాలం పుస్తకం మన పురాణాలు, ఆగమాలు, ఇతిహాసాలు, తంత్రాలు ఎలా ఆ మాయాజాలంలో చిక్కుకున్నాయో వివరించారు. రచయిత, చరిత్ర ప్రియులు, పరిశోధక ఆసక్తి అటువంటి వారందరూ చదవాల్సిన పుస్తకం ఇది.
నాస్తికులు,దేశద్రోహ వామపక్షవాదుల్ని ప్రశ్నించే అనేక ప్రశ్నలకు దీటైన జవాబులు ఈ పుస్తకంలో లభిస్తాయి. 250 రూపాయలతో ఓ పాతిక చరిత్ర పుస్తకాలు చదివిన ఫలం. తప్పక కొనండి. హిందూ ఇ-షాపుకి ఆర్డర్ పెట్టండి. సాహిత్య నికేతన్‌లో కూడా లభిస్తుంది ఈ పుస్తకం.
మిషనరీ మాయాజాలం – పాశ్చాత్య పంజరంలో తాంత్రిక భారతం. శ్రీ మైలవరపు సుధామోహన్ గారు అభినందనీయులు. సమీక్ష బి.ఎస్. శర్మ, ప్రజ్ఞా భారతి.