మిషనరీ మాయాజాలం – పాశ్చాత్య పంజరంలో తాంత్రిక భారతం – పుస్తక సమీక్ష

-ప్రదక్షిణ

‘మిషనరీ మాయాజాలం – పాశ్చాత్య పంజరంలో తాంత్రిక భారతం’ అనే ఈ మహద్గ్రంధంలో ప్రముఖ రచయిత, పరిశోధకులు శ్రీ మైలవరపు సుధామోహన్ గారు, బ్రిటిష్ కలోనియల్ / వలసవాద పాలనలో హైందవ ధర్మానికి వ్యతిరేకంగా మిషనరీలు పన్నిన కుట్రలు, మొత్తం భారతీయ నాగరికతను క్రైస్తవ మతచట్రం కింద ఇరికించి చేసిన వక్ర వ్యాఖ్యానాలు, వారు అవలంబించిన వక్రమార్గాలు, అనేక వక్రీకరణల గురించి సవివరంగా సోదాహరణంగా వ్రాసారు. 17వ శతాబ్దం నుండి బ్రిటిష్ పాలకులు దక్షిణ భారతీయ భాషలు నేర్చుకుని, బైబిల్ ని అనువదింపజేసి, కొందరిని మతం మార్చి, వారి ద్వారా బ్రిటిష్ పాలనకు, పాలకులకు, భారతీయులు అనుకూలంగా తయారవాలని ఎన్నెన్నో వక్రీకరణలకు పాల్పడ్డారు. బ్రిటిష్ పాలకులు, మిషనరీలు వేరు కాదు, ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాలు అని ఈ పుస్తకం వివరిస్తుంది.

భారతదేశాన్ని, దక్షిణాదిని పాలించిన రాజులలో అధిక సంఖ్యాకులు శూద్రులే అయినా, శూద్రులను అణిచివేసినవారిగా బ్రాహ్మణులను చిత్రీకరించడంలో, బ్రిటిష్ పాలకులు సఫలీకృతులైనారు. బ్రిటిష్ వారి పాలనా విధానాలు, వారి అణచివేత వికృతాలు, వారు ప్రజల ధనధాన్యాలను కొల్లగొట్టడంలో చేసిన దౌర్జన్యాలు, ప్రజలు తెలుసుకోకుండా, వర్ణాశ్రమ ధర్మాలే నిమ్నవర్గాల దైన్య స్థితికి కారణం అని ప్రచారం చేసారు.

సంస్కృతం నుంచి యూరోపియన్ భాషలలోకి నకలు చేసిన అసమగ్రమైన, అసంపూర్ణమైన భాషాశాస్త్రపు సిద్ధాంతాల ద్వారా అనాధారితమైన తప్పుడు సిధ్ధాంతాలు ఎన్నో సృష్టించారు. క్రైస్తవ సిద్ధాంతాలు, యూరోపియన్ సామాజిక వ్యవస్థల ఆధారంగా, అక్కడి దృష్టితో, మిషనరీలు భారతీయ వ్యవస్థలకు వక్ర వ్యాఖ్యానాలు చేసారు. ఈ రోజుకీ మన పాలనా వ్యవస్థలో భాగమైన `కాస్ట్ ‘, `అస్పృశ్యత’, మొదలైనవి ఈ విధంగా సృష్టించబడినవే. భారతీయ ఇతిహాసాలు, చరిత్ర, కాలమానం మొదలైనవన్నీ కట్టుకధలుగా వర్ణించారు.

విభిన్న ఉపాసనా పద్ధతులతో, వైవిధ్య సంప్రదాయాలతో, వివిధ ఆచారాలతో విలసిల్లిన సనాతన భారతీయ సమాజాన్ని, ఏకరీతిలో క్రైస్తవ పాలనకి అనుగుణంగా మలచడానికి, హిందువులను విభజించడానికి విలియం జోన్స్ మనుస్మృతిని ఒక ఉపకరణంగా వాడుకున్నాడు. పాశ్చాత్యుల భాషాశాస్త్రం ఆధారంగా మాక్స్ ముల్లర్ ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని సృష్టించాడు. తర్వాత కాలంలో ఆయనే తాను పొరపడ్డానని, భాష-జాతి వేరు అని చెప్పినా, ఈనాటికీ ఆ నకిలీ సిద్ధాంతం సజీవంగానే ఉంది, విద్యాలయాల్లో బోధింపబడుతూనే ఉంది. ఇదే ఆర్య-ద్రావిడ జాతులు అనే విభజన సిద్ధాంతానికి పునాది. ఈ ఆర్య- ద్రావిడ సిద్ధాంతాలు, మొదట శాక్తేయాన్ని, ఆ తరువాత శైవాన్ని, ధార్మిక పరంపర నుండి చీల్చి, ఆ విశిష్ట సంప్రదాయాలను క్రైస్తవానికి అనుకూలంగా మార్చడానికి నానా ప్రయత్నాలు చేసారు. `ద్రావిడ మతం’ గురించి మిషనరీలు చేసిన అనేక తీర్మానాల వెనకనున్న వాస్తవాలను ఈ పుస్తకం వెలుగులోకి తెస్తుంది.

వేదాలతో పాటు శైవాగమాలు, వైష్ణవ ఆగమాలు, తంత్ర శాస్త్రాలతో, నిగమాగమ ఆచార సంస్కృతుల ఆధారంగా భారతీయ వ్యవస్థ నడిచేది. శైవంలో ఉన్న 25 భాగాల నిగమాగమాలలో అనేక మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు వీరశైవం అతి మార్గం, అనగా బుద్ధి ధర్మానికి అతీతమైన పరమేశ్వర శాస్త్రం. ప్రస్తుతం `నిమ్న వర్గాలు’ అనబడేవారిలో అనేక కులాలు ఆగమ, తాంత్రిక సంప్రదాయాలకు చెందిన ఉపాసనా మార్గాలలో సాధన చేసేవారు. వాటిని సనాతన ధర్మం నుంచి విభజించి, వక్రీకరించి, వాటన్నిటినీ కలిపికట్టుగా `ద్రావిడ మతం’గా పేరు పెట్టారు. శివ-శక్తుల సంప్రదాయాలను ధార్మిక పరంపరనుంచి వేరుచేసి, క్రైస్తవంలో కలుపుకోవడానికి చేసిన భయంకర ప్రయత్నాలను ఈ పుస్తకం వివరిస్తుంది.

ఆర్య- ద్రావిడ సిద్ధాంతం ద్వారా వైదిక పరంపర భారత దేశానిది కాదని, దాన్ని బ్రాహ్మణులు బయటనుంచి తెచ్చారని చెపుతూనే అదే వైదిక పరంపర నుండి పుట్టిన ఆగమ- తాంత్రిక పరంపరకు చెందిన సంప్రదాయాలను, ద్రావిడ మతాలుగా, కొన్నిటిని `ఆనిమిశం’ (ప్రకృతి ఆరాధన)గా పేర్లు పెట్టారు. మొత్తం గ్రామదేవతల సంప్రదాయాలను ఇందులో కలిపేసారు. బిషప్ రాబర్ట్ కాల్డ్వెల్ లాంటివారు పాటించిన పద్ధతులను తర్వాత కూడా మిషనరీలు కొనసాగించి గ్రామదేవతల వ్యవస్థను సమూలంగా పేకిలించే ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తూ, స్వాతంత్ర్యం తరువాత కూడా, ఇదే పద్ధతి కొనసాగి, గ్రామదేవతల ఆలయాలు శిధిలమైనాయి. జానపదుల ఆచారాలకు మూలగ్రంథాలు సంస్కృతంలో ఉన్నా, వాటికి విరుద్ధంగా ప్రచారం చేశారు. ఈ పుస్తకంలో ఒక పూర్తి అధ్యాయం గ్రామదేవతల గురించి శాస్త్రీయ వివరాలు అందిస్తుంది.

సనాతన ధార్మిక పరంపర నుంచి పనిగట్టుకుని తాంత్రికాన్ని చీల్చి, మిషనరీలు వాటి జ్ఞానాన్ని తస్కరించి, వాటిని క్రైస్తవంలోకి జీర్ణిస్తూ, క్రైస్తవ సామాజిక చట్రాలలోకి ఇరికించి వక్ర వ్యాఖ్యానాలు చేశారు. ఈ మిషనరీ మాయాజాలపు కనికట్టు నుండి భారతీయులను ఈ పుస్తకం మేలుకొలుపుతుంది.
అలాగే సంస్కృతం ఆర్య జాతి భాష అని, తెలుగు, తమిళం, కన్నడ మొదలైనవి ద్రవిడ భాషలని, తల్లీబిడ్డల లాంటి భాషల సంబంధాన్ని, ఆయుధీకరించి భాషా వేర్పాటువాదం సృష్టించారు. ఈ పుస్తకం ఈ సిద్ధాంతాల బండారాన్ని బయటపెడుతుంది.
అలాగే మిషనరీల మతమార్పిడి పర్వం, మంత్ర-తంత్ర శాస్త్రాలు, డెమోనోలేటరీ (మరణించినవారికి గుడులను కట్టే పద్ధతిని, పిశాచాల/దయ్యాల పూజలని పేరు పెట్టారు) లేక భూత పిశాచ పూజలని పేరుపెట్టి, క్రైస్తవంలో ఉండే సాతాను ప్రార్థనలతో పోల్చారు.

ఇవేకాక, ఈ పుస్తకం, భాషా సిద్ధాంతాలు, సంస్కృత- ప్రాకృత- దేశ్య భాషాలు, వాటి ప్రభావాలను వివరిస్తుంది. బిషప్ రాబర్ట్ కాల్డ్వెల్, జేగేన్బాల్గ్, రెవెరన్డ్ వైట్హెడ్, మొదలైన వారి కుతంత్రాలు ఈ పుస్తకం బయట పెడుతుంది. తంత్ర శాస్త్రాలకి కూడా మూలం వేదమే అని సశాస్త్రీయంగా ఈ పుస్తకం వివరిస్తుంది.

కమ్యూనిజం సిద్ధాంతాలు ఏవిధంగా వలసవాద పాలనా దౌర్జన్యాలను కప్పిపెట్టాయో రచయిత వివరించారు. అలాగే మిషనరీల / బ్రిటిష్ పాలనా కుటిల నీతికి, కమ్యూనిజం సిద్ధాంతాలకి ఉన్న సారూప్యతను కూడా తెలియజేశారు.

చివరగా, అనుబంధంలో చాలా విలువైన సమాచారాన్ని రచయిత అందించారు. వాటిలో శ్రీ కోటా వెంకటాచలం గారు, శ్రీ చిలుకూరి నారాయణరావు గారు, డా. వేదవ్యాస గారు, శ్రీ చివుకుల అప్పయ్య శాస్త్రి గార్ల వ్యాసాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.

రచయిత శ్రీ మైలవరపు సుధామోహన్ గారు సుదూర కానడాలో వైమానిక రంగంలో పనిచేస్తూ కూడా, వారి ప్రతి నిమిషం, భారతదేశ వారసత్వం, వలసవాద చరిత్ర, సనాతన ధర్మశాస్త్రాల మీద విస్తృతమైన మరియు లోతైన పరిశోధన చేస్తున్నారు. వర్ణం, కులం, జాతి, అంటరానితనం మొదలైన క్లిష్టమైన అంశాల మీద పరిశోధన చేస్తున్నారు. ఆంగ్లంలో వారి ప్రఖ్యాత పుస్తకం `శివస్య కులం’. డా. రాజీవ్ మల్హోత్రా గారి `స్నేక్స్ ఇన్ ద గంగా’ పుస్తకాన్ని డా. బొమ్మరాజు సారంగపాణి గారితో కలిసి తెలుగులో `గంగలో విషనాగులు’ పేరుతో అనువదించారు. శ్రీ పి. రంగారెడ్డి గారితో కలిసి `కుహనా మేధావులు’ అనే పుస్తకాన్ని వ్రాసారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి మెప్పు పొందిన `వర్ణాశ్రమ విజ్ఞానము’ వీరి ప్రముఖ పరిశోధనా గ్రంధం. ఇవే కాక హిందూ సమాజం ఎదుర్కుంటున్న సమస్యల గురించి అనేక వ్యాసాలు వ్రాసారు.

పుస్తకం ఇక్కడ లభించును.

Get the book here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *