
-కే :కేశవనాథ్
వామపక్ష విషవృక్షం
డా. రాజీవ్ మిశ్రా
అనువాదం : హైందవి
ప్రచురణ : సంవిత్ ప్రకాశన్
“యుక్తవయస్సులో కమ్యూనిజంవైపు ఆకర్షితుడికాకపోతే నీలో ఏదో లోపం ఉందని అర్ధం. ఆ తరువాత వయస్సు పెరిగి, జీవితానుభవం సంపాదించిన తరువాత కూడా కమ్యూనిస్టుగా మిగిలావంటే అప్పుడు కూడా లోపం ఉన్నట్లే” అనే మాటలు బెట్రాండ్ రస్సెల్ వంటి అనేకమంది ప్రముఖులు అన్నారు. నిజమే. ఉడుకురక్తం, ఆదర్శవాదం ఉండే యువతలో అన్యాయం, అసమానతలు, అక్రమాలను పూర్తిగా రూపుమాపేయాలన్న ఆవేశం, ఆవేగం ఉంటాయి. ఆ సమయంలో పీడిత, తాడిత, వెనుకబడిన, పేద ప్రజానీకానికి మేలు చేయడానికి “ఉద్యమించాలి” అనే భావన కమ్యూనిస్టు సిద్ధాంతం ద్వారా చాలా ఆదర్శవంతంగా, ఆచరణీయంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆ ఉద్యమ స్ఫూర్తి ఎంత తీవ్రంగా ఉంటే అంత వామపక్షవాదం తలకెక్కుతుంది. విచక్షణ, వివేచన మాయమవుతాయి. సాటి మనిషిని చంపడం కూడా ఉద్యమమే అన్న దుస్థితి దాపురిస్తుంది.
ప్రకృతిలో భిన్నత్వం,వివిధత్వం సహజం. ఆ వైవిధ్యం లేకపోతే జీవనచక్రం ముందుకు సాగదు. అయితే ఈ భిన్నత్వం, వైవిధ్యం అణచివేత, అక్రమం, అన్యాయానికి దారితీయకుండా నియంత్రించేదే “ధర్మం”. ధర్మం అనే భావన ప్రపంచానికి ఇచ్చినది భారతదేశం మాత్రమే. సర్వసృష్టి పరమాత్మ స్వరూపమని, అందుకే ఆ సృష్టిక్రమాన్ని, వ్యవస్థను అతిక్రమించకుండా జీవించడమే ధర్మమని మన ఋషులు బోధించారు.
ఆ పరమాత్మ భావన, ధార్మిక భావన లేని పాశ్చాత్య ప్రపంచంలో పుట్టిన కమ్యూనిజం పైకి అన్యాయం, అక్రమం, అణచివేతలపై పోరాటం చేస్తున్నట్లు కనిపించినా, చివరికి అటువైపుకే దారితీస్తుందని చరిత్రలో అనేక ఉదాహరణలు కనిపించాయి. పీడిత, తాడిత, అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని బయలుదేరిన నానారకాల కమ్యూనిస్టులు చివరికి పెట్టుబడిదారీ, బూర్జువా ప్రతినిధులుగా మారిపోవడానికి కారణం ఈ ధార్మిక భావన లేకపోవడమే.
కాబట్టి కమ్యూనిజం అనేది కేవలం ఒక రాజకీయ భావన, వ్యవస్థ మాత్రమే కాదని, అది పెడధోరణి, వక్రమార్గమని స్పష్టమవుతుంది. “ఇప్పుడు కమ్యూనిజం ఎక్కడ ఉంది? అది ఎప్పుడో అంతరించిపోయింది” అని అనుకోవడం పొరపాటని అర్థమవుతుంది. కమ్యూనిస్టు పాలన, కమ్యూనిస్టు రాజకీయ వ్యవస్థ అంతంకావచ్చునుకానీ, ఆ పెడధోరణి, వక్రీకరణ మనస్తత్వం, ఆలోచన ఎక్కడికీ పోలేదు. ఇప్పటికీ అందరి మనస్సులను కలుషితం చేస్తూనే ఉంది.
ఇదే విషయాన్ని డా. రాజీవ్ మిశ్రా తన “విషైలీ వామపంథ్” (తెలుగులో “వామపక్ష విషవృక్షం”) అనే ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించారు.
కమ్యూనిస్టు ఆలోచనా ధోరణి కనిపించని శత్రువు అని వివరించే “వామపక్షవాదం చీకట్లో శత్రువు” అనే అధ్యాయంతో మొదలయ్యే ఈ పుస్తకం “వామపక్షవాదం స్వరూపం మార్చుకునే వైరస్” అనే అధ్యాయంతో ముగుస్తుంది. ఈ రెండు అధ్యాయాల మధ్యలో వామపక్షవాదపు ప్రయాణం, వివిధ దేశాల, సమాజాల మేధోపరమైన, ఆర్థికపరమైన వనరులను ఉపయోగించుకుని ఆ సమాజాలనే అధోగతికి చేర్చిన తీరును చాలా చక్కగా వివరించారు.
సైద్ధాంతిక చర్చ కాకుండా ప్రత్యక్ష ఉదాహరణలు, చరిత్రలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని వామపక్షవాదం ఎలాంటి విషవృక్షమో వివరించారు. ఆ విషవృక్షపు వేరులు ఎంత బలంగా పాతుకుపోయాయో, ఎంతవరకూ విస్తరించాయో అర్థమవుతుంది. వోకిజం, జెండర్ ఈక్వాలిటీ, పొలిటికల్ కరెక్ట్‌నెస్, సెక్యులరిజం, మైనారిటీయిజం వంటి ఆధునిక జాడ్యాలన్నింటి మూలస్థానం కమ్యూనిజమేనని స్పష్టమవుతుంది.
ఉదాహరణలు, సంఘటనల ద్వారా వివరించడంవల్ల ఈ పుస్తకంలో చెప్పిన విషయం ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక రూపంలో మన అనుభవానికి వచ్చినదేనని తెలుస్తుంది. నిత్యజీవితాలను, మన ఆలోచనలను వామపక్ష విషవృక్షపు గాలులు ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో అర్థమవుతుంది. ముఖ్యంగా ఆదర్శవాదంతో తొణికిసలాడే యువత ఈ గాలుల తాకిడికి గురై నిర్వీర్యం, నిస్తేజంగా మారే ప్రమాదం కనిపిస్తుంది. ఆ ప్రమాదం నుండి కాపాడటానికి ఎక్కువమంది యువతతో ఈ పుస్తకం చదివించాలి.
పుస్తకం ఇక్కడ లభించును.
Get the book here