Description
పుస్తక సంక్షిప్త పరిచయం :
భారతదేశానికి భౌతికంగా 1947లో స్వాతంత్య్రం వచ్చినా, సైద్ధాంతికంగా నేటికీ స్వాతంత్య్రం లభించలేదు. సామ్రాజ్యవాదులు ఊహలే ఆధారంగా సృష్టించిన ఆర్య-ద్రావిడ సిద్ధాంతాన్ని అన్ని భారతీయ రంగాలలోనుండీ తొలగించలేకపోవడం ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నది.
భాషా శాస్త్రాన్ని ఉపయోగించి బైబిల్ లోకి భారతనాగరికతను ఇరికించడం ద్వారా ఆర్య-ద్రావిడ సిద్ధాంతం పుట్టింది. ఇలా చేసిన విశ్లేషణలు నేటికీ మన సమాజంలో కల్లోలాన్ని రేపుతున్నాయి. మిషనరీ సిద్ధాంతాల, విశ్లేషణల ఆధారంగానే నేటికీ భారతదేశపు సమాజం పాలించబడుతున్నది. అలాంటి సామ్రాజ్యవాద సిద్ధాంతాలలో అతి ముఖ్యమైనది ఆర్యన్-ద్రవిడియన్ సిద్ధాంతం.
దక్షిణాదిలో భాష ఆధారంగా ద్రావిడ జాతుల సిద్ధాంతానికి ఆజ్యం పోసినవాడు మిషనరీ రాబర్ట్ కాల్డ్వెల్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇతను భాష ద్వారా సృష్టించబడిన ద్రావిడ అనే గుర్తింపులోకి గ్రామదేవతలను ఇరికించే ప్రయత్నం చేయడంతో ద్రావిడ మతం తయారైంది. ఇలా ద్రావిడ భాష, దాని ద్వారా ద్రావిడ జాతి, దాని ద్వారా ద్రావిడ మతం అనేవి తయారయ్యాయి. ఈ కొత్త గుర్తింపులు అంతకు పూర్వం ధార్మిక పరంపరకు చెరిగిన గుర్తింపులను తొలగించడంతో గందరగోళం మొదలైంది. ఇలా ఈ మిషనరీ ద్వారా సృష్టించబడిన ద్రవిడియన్ మాయాజాలం భారతదేశాన్నంతా కమ్మేసింది. ఈ మాయాజాలంలో చిక్కుకున్న చాలామంది భారతీయులకు ఈ మాయాజాలం వెనుకల ఉన్న సైద్ధాంతిక వాస్తవాలు తెలియవు.
సామ్రాజ్యవాదులు భారతదేశాన్ని పాలించే సమయంలో భారతీయులను విభజించి పాలించారన్న విషయం చిన్నప్పటినుండీ చదువుకుంటున్నాం. కానీ ఎలా విభజించారోనన్న విపులమైన వివరాలు ఇంకా మరుగునే ఉన్నాయి. ఇవి ఇలా మరుగున ఉండటానికి దక్షిణాదిన ప్రాచుర్యంలో ఉన్న ద్రవిడియన్ రాజకీయాలు కూడా ఒక కారణం.
భారత సమాజంలో కలుగజేయబడుతున్న గొడవలు, సంఘర్షణ మొదలైనవన్నీ కూడా పాశ్చాత్య భాషాశాస్త్రంపై, దాని ద్వారా ఏర్పడిన తులనాత్మక భాషాశాస్త్రం, చారిత్రిక భాషాశాస్త్రం ఇత్యాది పాశ్చాత్య శాస్త్రాలపై ఆధారపడి ఏర్పాటుచేయబడిన సిద్ధాంతాలపై నిలబెట్టబడి ఉన్నాయి. పాశ్చాత్య భాషా శాస్త్రం ద్వారా బైబిల్ పరంపరలోకి ధార్మిక నాగరికత చొప్పించబడి తద్వారా అపోహలకు, అపసిద్ధాంతాలకు కారణమవుతున్నది. అది ఎలా జరిగిందో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. సామ్రాజ్యవాద సైద్ధాంతిక చట్రాలలో ధార్మిక నాగరికత బందీగా మారిన వైనాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ పుస్తకాన్ని ఆసాంతమూ చదవాల్సిందే !
Reviews
There are no reviews yet.