మృణ్మయిలో చిన్మయి దర్శనం

వర్చస్సు కోసం, బలం కోసం, శక్తి కోసం ఈ మృత వీరుని హస్తం నుంచి ధనుస్సును గ్రహిస్తున్నాను. మీరూ.. మేమూ.. మనం విశ్వమంతా నిండిన వైరి చక్రాన్ని అతిక్రమిస్తాము. ఇతన్ని మాతృభూమి ఒడిలోకి అధిక వర్చస్సును ప్రసరింపజేసేందుకు చేరుస్తున్నాం.. శిరీష కోమలి ఈ మహిషి ప్రతీకారం జరిగేదాకా విచ్ఛిత్తి నుంచి రక్షించనీ, పృథివీ! ఇతడిని బలంగా నొక్కకు. ఊపిరి పీల్చుకోనీ, సులభంగా సుకుమారంగా ప్రవేశించనీ, అవనీ! తల్లి బిడ్డను పొత్తిళ్లలో ఒదిగినట్టు ఒదిగించుకో …

మాతృభూమి కోసం ఒక వీరుడు అమరుడైనప్పుడు అతడి నుంచి ప్రేరణ పొందిన సందర్భం ఇది.(ఋగ్వేదం, 10-18-9,10,11)

వాత్సల్య పూర్ణురాలివైన ఓ మాతృభూమీ.. నీకు ఎప్పుడూ మా నమస్కారం. నీ కార్య సాధనకోసం మా శరీరాలను సమర్పించుకుంటాను. రాష్ట్ర పురుషుడివైన ప్రభూ నీవు నిర్దేశించిన మహత్తరమైన కార్యాన్ని చేయటం కోసం మేము కటిబద్ధులమై ఉన్నాము. విశ్వం గెలువలేని శక్తిని, ప్రపంచం మోకరిల్లే సౌశీల్యాన్ని, మేము బుద్ధి పూర్వకంగా స్వీకరించిన ఈ మార్గంలో ప్రయాణించడానికి అనువైన విద్యను ప్రసాదించు. అభ్యుదయ సహిత నిశ్రేయస్సు పొందటానికి ఒకే ఒక సాధనం వీర వ్రతం. అది మా వీరుల అంత:కరణలో స్ఫురించుగాక. మా లక్ష్యాన్ని సాధించే నిష్ట మా హృదయాలలో ఎల్లప్పుడూ జాగృతమై ఉండుగాక.  మా సంఘటిత కార్యశక్తి మా ధర్మశక్తిని రక్షించాలి. మా దేశమును పరమ వైభవ స్థితికి చేర్చటం కోసం మాకు మీ ఆశీస్సులివ్వండి.

(నమస్తే సదావత్సలే ప్రార్థనకు తెలుగులో స్వేచ్ఛానువాదం)

ఆసేతు హిమాచలం ప్రతి నిత్యం.. కోట్ల నాలుకలపై ప్రతిధ్వనించే స్తోత్రం ఇది. ఇది ప్రతి స్వయం సేవకుడి అంతః స్వరము. శతాబ్ద కాలగా సాగుతున్న మహా యజ్ఞం అనంతకాల గమనంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఎలాంటి ఒత్తిళ్లకు బెంబేలెత్తకుండా భారత జాతిని స్వదేశ, విదేశ ప్రతీప శక్తుల నుంచి సంరక్షిస్తున్న సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రతి స్వయం సేవకుడిలో ప్రవహింపజేస్తున్న చైతన్యమిది. జాతి మత ప్రాంత భేదాలు లేని అఖండ భారత చైతన్యమే అది. ఈ జాతి చైతన్యం భౌగోళిక సంకేతం కాదు. సంపూర్ణ సాంస్కృతిక చైతన్యానికి సజీవ తార్కాణం కరసేవకుల శాఖ. వారికి మతం నినాదం కాదు సాంస్కృతిక ఆచరణ. వారిది ఉద్యమం కాదు.. నిరంతర సాధన. శబ్దం లేకుండా సమాజాన్ని జాగ్రతం చేసేందుకు చేసే సుదీర్ఘమైన జాతీయ తపస్సు అది. పురుషార్థ సాధన కోసం చేసే ఉపాసన. పేరు కన్నా పని పెద్దది. వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పదన్న భావనతో వ్యక్తిగత స్వార్థాన్ని త్యజించి సమష్టి సంకల్పంలో లీనమవడమే ఈ ఉపాసన అర్థం. వారికి రాజకీయ వ్యూహం ఉండదు. సామాజిక స్వభావ నిర్మాణం వారి లక్ష్యం. వారికి వేదికలు అక్కరలేదు, వీధుల్లోనే కార్య సాధన జరుగుతుంది. వారి నివాసం శిబిరాలలో ఉండదు.. ప్రతి భారతీయుడి హృదయాలలో ఉంటుంది. ప్రతి భారతీయుడిలో ఆలోచనను రేకెత్తించే మౌన ఉద్యమమది. వారంతా వీరులే.. యుద్ధంలో కాదు.. దైనందిన కర్తవ్య నిర్వహణలో. నియమబద్ధ జీవితంతో కూడిన శక్తి.. ప్రతి తరానికి మార్గదర్శి. వెయ్యేండ్ల జాతి జాగృతికోసం తపన. వర్షంలో తడుస్తూ.. ఎండలో కాలుతూ.. కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ.. గ్రామ ప్రజల జీవనాడిలో దేశాన్ని దర్శించటమే జాతీయ దృక్పథం. ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మహోన్నత మార్గం. ఈ మార్గంలో పయనించే ప్రతి స్వయంసేవకుడి జీవితం భరతమాతకు సమర్పణం.

ముస్లిం సంతుష్టీకరణ విధానం భారత రాజకీయాల్లో బహుశా ఖిలాఫత్ మూమెంట్ నుంచి ప్రారంభమైంది. ఒకనాడు బెజవాడలో కాంగ్రెస్ మహాసభల్లో వందేమాతరం పాడుతుంటే ఆ సభలో ప్రసంగించడానికి వచ్చిన అలీ సోదరులు స్టేజి దిగి నిలుచున్నారు. అది రెండో అంశం. 1925 కు ముందు ఇట్లాంటి అనుభవాలు చాలానే ఉన్నాయి. కాంగ్రెస్ పెద్దలు కూడా ఈ రకమైన పరిణామాలను చూసీ చూడనట్టుగా వదిలేశారు. అప్పటికి కేశవరావు బలిరాం హెడ్గేవార్ కాంగ్రెస్‌తో నడుస్తున్న కాలం. బహుశా  ఇది ఆరెస్సెస్ ఆవిర్భావానికి ఇలాంటి ఘటనలు ఏవైనా కారణం కావచ్చు.  డాక్టర్ హెడ్గేవార్ దీన్ని స్థాపించారు. నానా విధాలుగా ఉండే హిందూ సమాజాన్ని ఏకత్రితం చేయడం కోసం ఆయన ఒక బీజం వేశారు. తరువాత ఆ సంస్థను మాధవ్ సదాశివ్ రావ్ గోళ్వాల్కర్ చాలాకాలం నడిపించారు. మిగతా వారు దీన్ని నిరంతరం సంస్కరించుకుంటూ ముందుకు తీసుకొని వెళ్లారు. 1925 ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్ సమావేశం జరిగినప్పుడు హిందువులను ఏకం చేయడానికి అందులో ఒక ప్రయత్నం జరిగింది. ‘న హిందూ పతితో భవేత్’ అన్న నినాదాన్ని ఆ సమావేశానికి హాజరైన సాధువులతో నినదింప జేశారు. హిందువులు ఎప్పుడూ పతితుడు కాదు. పతనం కాదు. ఇదే మాట ఆ తరువాతి కాలంలో అనీబిసెంట్ థియోసాఫికల్ సొసైటీ స్థాపన సందర్భంలోనూ అన్నట్టు గుర్తు. అలాంటి హిందువులను జాగృతం చేయడం కోసమే సంఘం ఆవిర్భవించింది. ఈ సంస్థ మనం సాధారణంగా చూసే సంస్థల్లాంటిది కాదు. ఇది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో సభ్యులు స్వయంసేవకులు. తమంత తాముగా దేశానికి సేవ చేయడానికి వచ్చినవారు. ఎలాంటి అపేక్ష లేకుండా తన దేశం కోసం, తన జాతి కోసం, తన మాతృభూమి సంరక్షణ కోసం ఉద్విగ్నతతో, ఉద్వేగంతో వ్యక్తిగత ఇష్టానిష్టాలకు దూరంగా వచ్చి సేవలు చేసేవారు. ఈ సంస్థ ఆవిర్భావం నాటి నుంచి నియమావళి లేదు. మెంబర్‌షిప్‌లు లేవు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వం ఒత్తిడి తీసుకొని రావడంతో ఒక నియమావళి అంటూ ఏర్పాటు చేసుకోవడం జరిగిందే తప్ప దానికి ఎలాంటి నియమం లేదు. ప్రతిరోజూ శాఖ నిర్వహించుకోవడం.. భారత ఉజ్జ్వల మహోజ్జ్వల గాథలను చెప్పుకోవడం, నిరంతరం హిందూ సమాజ జాగృత చేతన ప్రబోధన చేయడమే జరుగుతుంది. అంతకు మించి ఏమీ ఉండదు.

అలాంటి చైతన్య జ్వాల నుంచి ఎగిసి వచ్చిన వేలు లక్షల మంది స్వయం సేవకులలో ఒకరు కస్తూరి రాకా సుధాకర్ రావు. ఒకరే అయినా ఉన్నతుడు. ఒకరే అయినా వేల మంది స్వయంసేవకులను తయారు చేసిన సాధకుడు. ఆ ఒక్కరే లక్షల మందిని నిత్యం తన చైతన్య స్రవంతిలో ముందుకు తీసుకుపోతున్న ఉపాసకుడు. సుదీర్ఘ కాలంగా ఆయన చేసిన తపస్సు ఒక్కొక్కటిగా ఫలాలను అందిస్తున్నది. మొన్నటి ఫలం ‘అడుగడుగున గుడి ఉంది’. నిన్నటి ఫలం ‘కాశ్మీర్ ఫైల్స్’. ఇవాళ్టి ఫలం ‘అస్సాం గాథలు’. కొందరికి ఆయన స్వయం సేవకుడిగా తెలుసు. మరికొందరికి పాత్రికేయుడిగా పరిచయం. ఇంకొందరికి రాకాలోకం సుధాకర్‌గా తెలుసు. కానీ, ఆయన తన జాతి సముద్ధరణ కోసం.. ఈశాన్య భారతంలో చైతన్యం తీసుకురావడం కోసం దశాబ్ద కాలం తన జీవితాన్ని ధారపోసిన విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ.. అక్కడి తన అనుభవాలు మాత్రం ఎవ్వరికీ తెలియవు. ఆయనకు తప్ప..

ఇప్పుడు ఆ అనుభవాలు ‘అస్సాం గాథలు’ గ్రంథ రూపంలో మన ముందుకు వచ్చాయి. ఇందులోని ప్రతి అక్షరం మనల్ని హృదయంలో గుచ్చుకుంటుంది. అస్సాంలో దశాబ్ద కాలం తాను స్వయం సేవలో పాల్గొన్న సమయంలో తనతోపాటు కలిసి నడిచిన స్వయంసేవకుల వీర గాథలివి. 1990వ దశకంలో అస్సాంలో నెలకొన్న అత్యంత ఉద్రిక్త అస్సాం చరిత్రకు సంబంధించిన కథలివి.

ఈ గ్రంథం ముందు మాటలోని మొదటి రెండు పేరాలతోనే మనల్ని ఈ పుస్తకం తనలోకి లాక్కుపోతుంది. ‘చరిత్ర చెట్లతో, రాళ్లు రెప్పలతో తయారు కాదు. చెట్టులో చైతన్య స్వరూపాన్ని చూసేవారితో, రాళ్లు రప్పల్లో రాముడిని చూసేవారితో, వారి జీవన విలువలతో, వారి ఆదర్శాలతో చరిత్ర తయారవుతుంది. మృణ్మయిలో చిన్మయిని చూసే చేతనా చక్షువులున్న వాడే జన్మభూమి పట్ల తాదాత్మ్యాన్ని పెంచుకుంటాడు. ఆ తల్లి కోసం తన సర్వస్వాన్ని అర్పించుకునేందుకు సిద్ధపడతాడు. అలాంటి అనేకమందిలో కొద్దిమంది కథ ఇది.’

రాకా సుధాకర్ అస్సాంలో ఉన్న సమయం అత్యంత సంక్లిష్టమైన కాలం. ఢిల్లీలో ప్రభుత్వాలు అత్యంత అస్థిరంగా ఉన్న కాలమిది. 1984లో ఇందిరాగాంధీ హత్య జరిగిన తరువాత 2014 వరకు భారతదేశంలో సుస్థిరంగా కొనసాగే ప్రభుత్వమే లేకుండా పోయింది. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజకీయ అస్థిరత రెండూ కలిసి దేశాన్ని కుదిపేస్తున్న సందర్భం అది. రెండు దశాబ్దాల కాలంలో సుమారు ఏడు ప్రభుత్వాలు మారిన అనిశ్చితి. ఆ సమయంలో అస్సాం మాత్రమే కాదు.. ఈశాన్య భారతం మరింత అల్లకల్లోలంగా ఉన్న దుస్థితి. నిజానికి భారతదేశాన్ని ఏడు దశాబ్దాల పాటు ఏలిన వివిధ ప్రభుత్వాలు ఈశాన్య భారతాన్ని ఏనాడూ పెద్దగా పట్టించుకోలేదు. 1962 నాటి చైనా ఆక్రమణ సందర్భంలో అస్సాం కోల్పోతున్నామంటూ ఆకాశవాణిలో గద్గద స్వరంతో నాటి ప్రధాని నెహ్రూ మాట్లాడిన నాటి నుంచి కూడా అస్సాం కేంద్ర ప్రభుత్వానికి పెద్దగా పట్టింపు లేని ప్రాంతం. నిరంతర కల్లోల ప్రాంతం. బంగ్లాదేశ్ నుంచి లక్షల మంది అస్సాం, బెంగాల్, త్రిపురలకు తరలి వచ్చి తిష్ట వేసుకున్నారు. ఒక వైపు వేర్పాటువాదం, మరోవైపు విచ్ఛినకరవాదం, ఇంకోవైపు ఉగ్రవాదం.. ఉల్ఫాలు, నాగాలు, బోడోలు.. ఒకరా ఇద్దరా అత్యంత విషమ పరిస్థితి. ఈ వేర్పాటువాదం ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ మధ్యనే 2020 నాటి ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టయిన షర్జీల్ ఇమామ్ అస్సాంను మనం తేలికగా భారత్ నుంచి విడగొట్టాలని నినాదాలు చేసినవాడే.   ఈ వలసదారులను వెళ్లగొట్టాలని అస్సాం విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించినప్పుడు 1986లో రాజీవ్ గాంధీ అందుకు అంగీకరిస్తూ ఈ విద్యార్థి సంఘంతో ఒప్పందం చేసుకున్నారు. కానీ, ఆ ఒప్పందాన్ని తుంగలో తొక్కేశారు. అస్సాం గణపరిషత్ అస్సాంలో అధికారంలోకి వచ్చింది. ఏ వలసదారులను వెళ్లగొట్టాలని అస్సాం గణపరిషత్ ఉద్యమించిందో.. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ వల్ల కూడా కాలేదు.

ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో రాకా సుధాకర్ లాంటి వారిని అనేకులను దేశం నలుమూలల నుంచి దేశ రక్షణే బాధ్యతగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అస్సాంకు పంపించింది. ఎలాంటి హడావిడి లేదు. సంఘానికి సంబంధించిన అనేక శాఖలు మౌనంగా తమ పని తాము చేస్తూ పోయాయి. ఈరకమైన వాతావరణంలో తమకు, తమ తోటి స్వయం సేవకులకు ఎదురైన అనుభవాల కలబోత ఈ గ్రంథం.

ఇందులో మొదటి కథ కృష్ణకుమార్ గోయెంకాది. దేశం కోసం ఒకసారి తనకు తాను సంసిద్ధమైతే వెనుకడుగు వేయని మహోన్నత వ్యక్తిత్వానికి ఉదాహరణ గోయెంకా. ఒక వ్యాపారిగా ఉన్న గోయెంకా.. తన వ్యాపారాన్ని చేసుకుంటూనే.. దేశ రక్షణ కార్యంలో తానూ ఒక ఆయుధంగా మారారు. అలాంటి గోయెంకా దగ్గరకు ఉల్ఫా తీవ్రవాదులు వచ్చి నాలుగు లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించి వెళ్లారు. ఆయనకు ఏం చేయాలో తెలియలేదు. రాకాతో పాటు మరికొందరు ఆయన దగ్గరకు వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నారు. అత్యున్నత పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన మరుక్షణం ఆ సమాచారం పొల్లు పోకుండా తీవ్రవాదులకు తెలిసింది. దీంతో మరింత తీవ్రంగా హెచ్చరించారు. దీంతో తీవ్రవాదులకు ముడుపులు ముట్టచెప్పొద్దు అంటే అస్సాం వదిలి వెళ్లాలి. తొలుత అందుకు ఒప్పుకున్న గోయెంకా.. భార్యాపిల్లలను పంపించి.. తాను మాత్రం వెళ్లనే వెళ్లనంటూ పట్టుబట్టి ఉండిపోయారు. ఇల్లు మార్చేశారు. వేషం మార్చేశారు. వ్యాపారాన్ని కూడా వేరేచోటికి మార్చేశారు. చాలా రోజుల పాటు రకరకాల వేషభూషణాలతో తిరిగారే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ తీవ్రవాదులు అడిగిన మొత్తాన్ని మాత్రం ఇవ్వనే లేదు. ఎన్ని వేషభాషలు మార్చినా.. ప్రతి దినం శాఖకు మాత్రం హాజరు కాకుండా లేరు. చివరకు తీవ్రవాదులు అలిసిపోయారు.. అధికారులు అచ్చెరువొందారు. దేశం కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా, అదే సమయంలో ప్రాణాన్ని వృథాగా వదులుకోకుండా దేశం కోసం దేశ రక్షణ కోసం పరితపించిన జీవితం కృష్ణకుమార్ గోయెంకాది.

అస్సాంలో భారత సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరూ ఎక్కడి నుంచి వచ్చారన్న విషయం మాత్రమే తెలుసు. కానీ.. వారి కుటుంబ నేపథ్యం కానీ, వారి చదువు సంధ్యలు కానీ, వారి ఆర్థిక నేపథ్యం కానీ ఎవరికీ తెలియవు. ఎవరూ పెద్దగా వాటిని గురించి పట్టించుకోరు. ఒక స్వయం సేవకుడు వచ్చాడంటే.. ఆతడిని సమాదరించి తమ బృందంలో కలుపుకోవడమే. వచ్చిన తొలి రోజు నుంచే కార్య నిర్వహణలో మునిగిపోతారు. వారికి దొరికిందే భోజనం. సమయముంటేనే నిద్ర.. ఈ గ్రంథంలో పేర్కొన్న అనేక మంది స్వయం సేవకుల జీవితాలన్నీ అత్యున్నతమైనవే.

ఉల్ఫా ఉగ్రవాదం చాలా తీవ్రంగా ఉన్న సమయంలో అస్సాంలో అత్యధికులు క్రైస్తవంలోకి మారిన సదియాలో  భారతీయ చేతనా స్రవంతిని అత్యంత సాహసోపేతంగా ముందుకు తీసుకొని వెళ్లినవాడు హేమంత్ గొగోయ్. ఉగ్రవాదులు తనను హెచ్చరించినా.. నేరుగా తుపాకులతో వచ్చి 50 గజాల దూరంలో నిలుచున్నా.. అదరలేదు. బెదరలేదు. తనపై కాల్పులు జరుపుతున్నా భయపడకుండా ఉగ్రవాదులపై విరుచుకుపడి పోరాడిన వీరుడు. తన తొడకు తుపాకీ గుండు తగిలి రక్తం కారుతున్నా.. వెరవకుండా ఉగ్రవాదుల మీదకు లంఘించి వారిని పారదోలాడు. తాను దవాఖానలో చేరిన తరువాత కూడా కర్తవ్యాన్ని మరవకుండా నిర్వర్తించిన అరుదైన స్వయం సేవకులలో ఒకడు హేమంత్ గొగోయ్.

గుండెలో దమ్ముంటే పెన్ను కూడా గన్నుగా మారుతుందని నిరూపించిన మరో స్వయంసేవకుడు శశిధరన్. ‘తీవ్రవాది చేతిలోని తుపాకీ అతని పిరికిదనానికి చిహ్నం, భయాన్ని బందూకు బ్యారెల్ మాటున దాచుకున్న తీవ్రవాది చూపించేది మేకపోతు గాంభీర్యమే తప్ప మరేమీ కాదు. దేశ రక్షణ కోసం సైనికుడూ తుపాకీ పట్టుకుంటాడు. స్వాతంత్ర్యోద్యమంలో భగత్ సింగూ బందూకును పట్టుకున్నాడు. కానీ వారికి ఒక మహోన్నత లక్ష్యం ఉన్నది. మహాద్భుతమైన ప్రేరణ ఉన్నది. ప్రాణాలు తీసేందుకు కావాల్సిన ధైర్యంతో పాటు ప్రాణాలిచ్చేందుకు కావలసిన స్థైర్యమూ ఉంది.’ (పే.31)

భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఏ తీవ్రవాది అయినా పిరికివాడు.. భయస్తుడే.. ఒక లక్ష్యంతో పనిచేసేవాడికి, ఒక ఉన్నతమైన ప్రేరణ కలిగి ఉన్నవాడికి భయం అంటే ఏమిటో తెలియదు. అలాంటి వాళ్లలో శశిధరన్, ప్రమోద్ నారాయణ్ దీక్షిత్, మురళీ మనోహర్.. లాంటి వాళ్లు ఎందరో ఉన్నారు. నుదుటిమీద పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ పెట్టినా చిరునవ్వుతో మరణాన్ని ఆహ్వానించిన వాళ్లు వీరు. ప్రతి ఒక్కరి కథ చదువుతున్న కొద్దీ మనలో ఒక అనూహ్యమైన ఉద్వేగం ఉప్పొంగుతుంది. ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కండ్లల్లోనుంచి నీళ్లు ధారలవుతాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనగానే హేతువాదులు, కమ్యూనిస్టులు, రేషనలిస్టులు, మేధావులనబడే వారు పెద్ద ఎత్తున విరుచుకుపడతారు. గాంధీని చంపిన సంస్థగా ముద్ర వేస్తారు. నిషేధించాలని స్లోగన్లు ఇస్తారు. ఎందుకు నిషేధించాలి అంటే మతోన్మాద సంస్థ అంటారు. ఈ దేశంలో మతోన్మాదం అంటే కేవలం హిందూ సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. ఏది మతోన్మాదం? ఏది దేశభక్తి?

కాన్బిరాన్‌లో గ్రామపెద్ద ఒకరు ఉన్నారు. ఊరంతటికీ ఆయన చెప్పింది వేదం. ఆయన చిన్న కొడుకు హింకలాంగ్ సరస్వతి శిశుమందిర్ విద్యార్థి. చాలా చురుకైన కుర్రాడు. అతడిని విద్యార్థి కార్యకర్తగా తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ సంఘటన కార్యదర్శి అరవింద్ భట్టాచార్య, శిశుమందిర్ ప్రధానాచార్యులు పంకజ్ సిన్హా ఇద్దరూ కలిసి తండ్రి దగ్గరకు దాదాపు ఆరు గంటల పాటు నడకదారిన వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక వారికి బీభత్సమైన దృశ్యాన్ని చూడాల్సి వచ్చింది. ఆ గ్రామపెద్ద  గుడిసెతో పాటు.. అనేక గుడిసెలు అగ్నిప్రమాదానికి లోనై బూడిదైపోయాయి. ఆ ప్రమాదంలో ఆయన పెద్ద కొడుకు మరణించాడు. తాత్కాలికంగా గ్రామస్థులే తమ పెద్దకు గుడిసె వేశారు. కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి కూడా బుగ్గిపాలైన పరిస్థితి. ఈ దశలో ఆయన్ను కలవడానికి వెళ్లిన ఇద్దరు పెద్దలను ఆయన తన దుఃఖాన్ని దిగమింగుకుని సమాదరించారు. ఆ తాత్కాలిక గుడిసెలోనే ఆవాసం కల్పించారు. తెల్లవారి వారు తిరుగు ప్రయాణమవుతూ.. ఆ గ్రామపెద్దకు కొంత ఆర్థిక సహాయం అందించాలని ప్రయత్నించినా వారు సున్నితంగా తిరస్కరిస్తూ.. ఇంతకూ వారు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఈ పరిస్థితిలో తాము అడగటం భావ్యం కాదని వారించినా.. ఆయన ఒత్తిడితో హింకలాంగ్‌ను విద్యార్థి కార్యకర్తగా స్వీకరించాలని భావించిన విషయాన్ని వెల్లడించారు. గ్రామపెద్ద ఒక్కక్షణం కూడా ఆలోచించలేదు. పెద్ద కొడుకు దూరమయ్యాడన్న చింతనూ వదిలేశారు. తన చిన్న కొడుకు పుట్టగానే దేశం కోసం సమర్పించాలని నిర్ణయించుకున్నట్టు.. తీసుకువెళ్లాలని సూచించారు.

దేశంలో ఇలాంటి వారు ఉంటారా అంటే.. ఉన్నారని నిరూపించే సత్య సంఘటన ఇది. సినిమాల్లోనో, పురాణాల్లోనో ఇలాంటి వారుంటారేమో తప్ప నిజజీవితంలో దేశం కోసం సమర్పణగా ఉండటం స్వయంసేవకులకు మాత్రమే సాధ్యమేమో.

ఈ గ్రంథంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పద్మశ్రీ విష్ణుశ్రీధర్ వాకణ్కర్‌తో రాకా సుధాకర్ అనుభవం గురించి. యావత్ ప్రపంచమే మెచ్చే గొప్ప ఆర్కియాలజిస్టు.. అత్యంత సాధారణమైన జీవితాన్ని గడిపే అసాధారణ మేధావితో కొద్ది రోజులు తాను కలిసి నడిచిన ప్రయాణాన్ని చాలా అద్భుతంగా విశ్లేషించారు. మధ్యప్రదేశ్ లోని రైసేన్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ భీమ్ బేట్కా గుహలను కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ వాకణ్కర్. లక్ష సంవత్సరాల నాటి ఈ 750 గుహల్లో అత్యంత ప్రాచీన రంగుల చిత్రాలను వారు విశ్లేషించారు. చింపిరి జుట్టు, ఒక సంచీ.. అందులో పుస్తకాలతో వచ్చిన డాక్టర్ వాకణ్కర్ అస్సాంలో పలు ప్రాంతాలను చూశారు. గుప్తయుగం నాటి పర్వతియా మందిరాన్ని చూసిన ఆయన గుప్తుల కాలం నాటి అనేక చిహ్నాలను ఒక ధారగా చెప్పటం అనేది ఒక అద్భుతం. ఆ తరువాత వారిద్దరూ ఒక ఇంట్లో ఉన్నప్పుడు అంతటి ఆర్కియాలజిస్టు ఖిచిడీ వండి పెట్టడం.. ఈ గ్రంథ రచయిత తినడం అన్నది ఎంత గొప్ప అనుభూతి. ఆయన ద్వారా ఆర్య ద్రావిడ సిద్ధాంతం, దాశరాజ్ఞం వంటి అనేక చారిత్రక అంశాలను రాకా సుధాకర్ వినడం అవలోకనం చేసుకోవడం మరుపురాని సన్నివేశం. రాకా సుధాకర్ గారిపై డాక్టర్ వాకణ్కర్ లాంటి ఎంతో మంది మహానుభావుల ప్రభావం ఆయనపై ఎంత ఉన్నదో ఈ వ్యాసం చెప్పకనే చెప్తుంది.

కేవలం స్వయంసేవకుల అనుభవాలే కాకుండా అస్సాం అంటే ఏమిటన్న అద్భుతమైన సంగతులను ఆయన వివరించారు. ఒక్కో గాథను చెప్తూనే.. అస్సాంలోని 90వ దశకంలో నెలకొన్న అనేక రాజకీయ సామాజిక పరిస్థితులను వివరించుకుంటూ వచ్చారు. అంతే కాకుండా అస్సాం చరిత్ర ఏమిటి? అసలు అస్సాం అంటే ఏమిటన్న విషయాన్ని అద్భుతంగా వివరించారు. ఎందుకంటే.. మనం చాలా గొప్ప మేధావులం, జ్ఞానవంతులమని భావిస్తుంటాం కానీ అస్సాం గురించి కానీ, ఈశాన్య భారతం గురించి కానీ మనకు ఏమీ తెలియదు. అస్సాం వెళ్లినా టూరిస్టులుగానే వెళ్లి వస్తాం. కానీ, మన చదువులు చదవని సాధుసంతులకు అస్సాం పవిత్రత ఏమిటో బాగా తెలుసు. జగత్తుకే గురువైన శ్రీకృష్ణుడు అస్సాం నేలపై నడయాడిన మహానుభావుడు. సతీదేవి శక్తి పీఠం కామాఖ్య కొలువైన ప్రదేశం అది. ఈశాన్య భారతం గురించి రాకా సుధాకర్ ఎలా వర్ణించారో ఈ నాలుగు మాటలు చదివితే చాలు ఒడలు పులకరిస్తుంది. “తాండవ నర్తన సమయంలో నలుదెసలా వ్యాపించిన శివుడి జడల్లా కశ్మీర సానువుల నుంచి వ్యాపించిన హిమాలయాల శ్రేణుల పాయలు పాయలై ఈశాన్య భారతానికి చేరుకునేసరికి వీరభద్రుడి కేశాగ్రాల కొరడాలవుతాయి. వాటిపై గహనాటవులు, కఠిన శిలలు అల్లికలై, అమరికలై ప్రకృతి, పరమేశ్వరుల పవిత్ర ఆలింగనాల దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి. వాటి నడుమ ఎక్కడ పడితే అక్కడ నిర్ఝరులూ వాగులు, వంకలు నదులు నురగల పరుగులతో గలగల స్వరాలతో, కలకల స్వనాలతో పరమ మాతపితల మెడలోని అద్భుత యుగళ మాలాతతులవుతాయి. వేనవేల అందాలతో, వైవిధ్యమైన చందాలతో అలరారే ఈ భూమి లక్ష్ వేషాల, కోటి రూపాల కామరూప భూమి అయింది. అందుకే దాని పేరు కామరూప్ అని స్థిరపడింది.” ఇంత అద్భుత వర్ణన ఇది. ఇవాళ్టి గువాహటియే నాటి ప్రాగ్జ్యోతిష పురం. ప్రాగ్జ్యోతిషం అంటే తూర్పున ఉదయించే తొలి కిరణాలు అని అర్థం.

గ్రంథం చివరలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రస్థానాన్ని సమగ్రంగా వివరించారు. గాంధీజీ హత్యానంతరం సంఘంపై అన్యాయంగా సాగిన నిర్బంధాన్ని సవివరంగా పేర్కొన్నారు. గురూజీని బంధించడం, అనేక రాష్ట్రాలలో స్వయంసేవకులను అరెస్టు చేయడం.. కానీ స్వయం సేవకులు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా భరతమాత సేవలో నిమగ్నమైన తీరును వివరించారు. గాంధీజీపై అస్సాం ప్రజల్లో ఉన్న అపారమైన భక్తిభావాన్ని సంఘం వ్యతిరేకులు తమకు అనుకూలంగా మలచుకున్నారు. బిరించి బారువా అనే రచయిత రాసిన భారతదేశ చరిత్ర గ్రంథంలో ప్రత్యక్షంగానే గాంధీజీని ఆరెస్సెస్ హత్య చేసినట్టుగా ఆరోపించారు. ఈ అంశాన్ని అస్సాంలో ఆనాటి ప్రభుత్వం పాఠ్య పుస్తకాల్లో సిలబస్‌గా కూడా పెట్టారు. దీనితో స్వయంసేవకులపై దాడులు తీవ్రమయ్యాయి. చివరకు కోర్టులో కేసు వేసి వ్యాజ్యం గెలిచి ఆ పాఠాన్ని తొలగించాల్సిన అనివార్యత ఏర్పడింది. చివరకు బిరించి బారువా తాను రాసిన మాటలకు లిఖిత పూర్వకంగా క్షమాపణ కూడా చెప్పారు. ఇలాంటి అనేక సన్నివేశాలు మనకు ఈ గ్రంథంలో కనిపిస్తాయి.

ఈ గ్రంథంలో మనకు మరో కనిపించే ఆకర్షణ ఇందులో కనిపించే ఫోటోలు. ఈ ఫోటోలనన్నింటినీ రాకా సుధాకర్ తాను అస్సాంలో ప్రచారక్ గా ఉన్నప్పుడు స్వయంగా తన కెమెరాతో బంధించినవే. ఇవన్నీ కూడా ఈ గ్రంథానికి మరింత వన్నెను తెచ్చి పెట్టాయనటంలో సందేహం లేదు.

చివరగా ఒక మాట. ఈ పుస్తకం చదువటాన్ని మొదలు పెట్టటం వరకే మీ బాధ్యత. తరువాత పుస్తకమే మిమ్మల్ని తనలోకి లాక్కుపోతుంది. చివరి వరకు ఒక్క సెకను కూడా విరామమివ్వకుండా చదివిస్తుంది. చైతన్యం రగిలిస్తుంది. ఈ దేశం పట్ల మన బాధ్యతను గుర్తు చేస్తుంది. మన కర్తవ్యం ఏమిటో బోధిస్తుంది. స్వయం సేవకుడు స్వయంసేవకుల త్యాగాలను అక్షర బద్దం చేసిన గ్రంథం ఇది.

‘లుయితొర్ పారొరె
అమి డెకాలొరా
మరిబోలోయ్
భయ్ నాయ్
(మృత్యువంటే భయం లేదు. మహాబాహు పుత్రులం)
ప్రతి స్వయం సేవకుడి అంతర్నినాదమిది. ఈ గ్రంథం ఆ నాదానికి ప్రతిధ్వని.

***

Source 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *